
Daily devotion · Monday, 16 November 2026
నీకు తోడుగా ఉండే దేవుడు
Scripture
న్యాయాధిపతులు 6:14–16నేను నీకు తోడై యుందును
Reflection
న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో గిద్యోనును దేవుడు పిలిచిన సంఘటనను చదువుతాం. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతుల్లో తీవ్రమైన బాధలను అనుభవిస్తున్నారు.
ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి చెడుతనాన్ని జరిగించి, ఆయనకు అవిధేయులయ్యారు. అందుకే దేవుడు వారిని ఏడు సంవత్సరాలు మిద్యానీయుల చేతికి అప్పగించారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పంటలను నాశనం చేస్తూ, వారిని ఎంతో ఇబ్బందిపెట్టేవారు. చివరికి ఇశ్రాయేలీయులు సహాయం కోసం దేవునికి మొరపెట్టుకున్నారు.
ఈ పరిస్థితుల్లోనే దేవుడు గిద్యోనును పిలిచారు.
11వ వచనంలో గిద్యోను మిద్యానీయులకు కనిపించకుండా ద్రాక్షగానుగలో గోధుమలను దుళ్లగొడుతున్నాడని చదువుతాం. అలాంటి సమయంలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై, దేవుడు అతనికి తోడుగా ఉన్నారని తెలియజేశారు.
14వ వచనంలో దేవుడు గిద్యోనును మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించడానికి పంపిస్తున్నారు.
అయితే గిద్యోను వెంటనే అంగీకరించలేదు.
15వ వచనంలో తన వల్ల ఇశ్రాయేలీయులను ఎలా రక్షించడం సాధ్యమని అడుగుతున్నాడు. మనష్షే గోత్రంలో తన కుటుంబం అంత ప్రాముఖ్యమైనది కాదని, తన తండ్రి కుటుంబంలో తాను చిన్నవాడినని చెబుతున్నాడు.
గిద్యోను తన పరిస్థితిని, తన కుటుంబ స్థాయిని, తనకున్న పరిమితులను చూస్తున్నాడు. అంత గొప్ప బాధ్యతను నిర్వర్తించడానికి తనకు తగిన సామర్థ్యం లేదని భావిస్తున్నాడు.
అయితే 16వ వచనంలో దేవుడు ఇచ్చిన సమాధానం ఎంతో ముఖ్యమైనది.
“నేను నీకు తోడై యుందును.”
దేవుడు గిద్యోనుకు అతని సామర్థ్యాన్ని గుర్తుచేయలేదు. అతడు ఎంత బలవంతుడో, ఎంత గొప్పవాడో వివరించలేదు.
బదులుగా, తానే అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేశారు.
గిద్యోను విజయం సాధించడానికి ఆధారం అతని బలం కాదు. అతన్ని పిలిచి, అతనితో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడే.
తర్వాత 7వ అధ్యాయంలో దేవుడు గిద్యోను సైన్యాన్ని మూడు వందల మందికి తగ్గించారు. ఇశ్రాయేలీయులు తమ సొంత బలంతో విజయం సాధించామని గొప్పలు చెప్పుకోకుండా ఉండడానికి దేవుడు అలా చేశారు ().
దీని ద్వారా దేవుడు ఒక ముఖ్యమైన సత్యాన్ని తెలియజేశారు. తన ప్రజలను రక్షించేది వారి గొప్పతనం కాదు, తన శక్తి, తన కృప.
ఈ సంఘటన దేవుని సహనం, ఆయన కృపను కూడా మనకు తెలియజేస్తుంది. ఇశ్రాయేలీయులు దేవునికి అవిధేయులైనప్పటికీ, ఆయన వారి మొరను విని గిద్యోను ద్వారా వారిని విడిపించడానికి సిద్ధపడ్డారు.
గిద్యోను ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులకు మిద్యానీయుల నుంచి విడుదల కలిగించారు. అయితే మనకు పాపం నుంచి శాశ్వతమైన రక్షణను అనుగ్రహించడానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువును పంపించారు. ఆయన మన పాపాల కోసం మరణించి, తిరిగి లేచారు. మన రక్షణకు ఆధారం మన సామర్థ్యం లేదా మంచి పనులు కాదు. దేవుని కృప, క్రీస్తు చేసిన రక్షణ కార్యమే.
ఈ సత్యం మన జీవితానికి కూడా ఎంతో అవసరం.
దేవుని వాక్యానికి విధేయులుగా జీవించాల్సిన సందర్భాల్లో కొన్నిసార్లు మన బలహీనతలను చూసి వెనుకాడుతుంటాం. మనకు తగిన జ్ఞానం లేదని, సామర్థ్యం లేదని, పరిస్థితులు అనుకూలంగా లేవని భావిస్తుంటాం.
అయితే గిద్యోను జీవితాన్ని చూసి, దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిలోనూ తప్పకుండా విజయం ఇస్తారని అనుకోకూడదు. మిద్యానీయులపై విజయం గురించి ఇచ్చిన వాగ్దానం ప్రత్యేకంగా గిద్యోనుకు సంబంధించినది.
కానీ ఈ సంఘటన ద్వారా దేవుని శక్తి, ఆయన విశ్వాస్యత గురించి మనం నేర్చుకోవచ్చు.
యేసుక్రీస్తు ప్రభువు కూడా లో తనను విడిచి మనం ఏమీ చేయలేమని బోధించారు. క్రైస్తవ జీవితంలో మనం మన సొంత బలంపై కాకుండా, ప్రభువుపై ఆధారపడాలి.
కాబట్టి దేవుని వాక్యం మనకు స్పష్టంగా బోధిస్తున్న విషయాల్లో మన బలహీనతలను సాకుగా చూపించి విధేయతకు వెనుకాడకూడదు. ఆయన సహాయం కోసం ప్రార్థిస్తూ, ఆయన వాక్యాన్ని అనుసరించాలి.
మన బలహీనతలకంటే దేవుని శక్తి గొప్పది. కాబట్టి మన నమ్మకం మన సామర్థ్యంపై కాకుండా, మనల్ని నడిపించే దేవునిపై ఉండాలి.
ఆలోచించండి
- దేవుడు గిద్యోనును పిలిచినప్పుడు అతడు ఎందుకు వెనుకాడాడు? దేవుడు అతనికి ఇచ్చిన సమాధానం మనకు ఆయన గురించి ఏం తెలియజేస్తుంది?
- దేవుని వాక్యానికి విధేయులుగా జీవించాల్సిన ఏ విషయాల్లో మీరు మీ బలహీనతలను చూసి వెనుకాడుతున్నారు? ఆ విషయంలో మీరు ఎలా స్పందించాలి?
- మీరు చేసే పనుల్లో మీ నమ్మకం దేనిపై ఎక్కువగా ఉంది? మీ సొంత సామర్థ్యంపైనా, అనుభవంపైనా, లేక దేవుని సహాయంపైనా?
Prayer
పరలోక తండ్రీ, నీవు శక్తిమంతుడవని, నీ ప్రజలను నమ్మకంగా నడిపించే దేవుడవని నీ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాము. కొన్నిసార్లు మా బలహీనతలను, పరిమితులను చూసి నీకు విధేయులుగా జీవించడానికి వెనుకాడుతున్నాము. అలాంటి సమయాల్లో మా సొంత సామర్థ్యంపై కాకుండా, నీపై ఆధారపడడానికి సహాయం చేయుము. నీవు మాకు ఇచ్చిన బాధ్యతలను విశ్వాసంతో, విధేయతతో నిర్వర్తించడానికి అవసరమైన జ్ఞానాన్ని, బలాన్ని అనుగ్రహించుము. యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.