భూమి లోపలికి వెళ్తున్న వేర్లు: మన క్రైస్తవ పరిచర్యకు పరిశీలన
భూమి లోపలి పొరల్లోకి ఏ చెట్టు వేర్లైతే బలంగా చొచ్చుకొనిపోవో ఆ చెట్టు అనతికాలంలోనే పెల్లగించబడుతుంది. మన దేశంలోని క్రీస్తు సంఘం కూడా అదే విధమైన ప్రమాదంలో ఉంది. ఇది చాలా విచారకరం.
క్రైస్తవ పరిచర్యలో ఎన్నో విస్తారమైన కార్యములు జరుగుతున్నాయి. కానీ స్థానిక సంఘం చారిత్రాత్మకమైన, వాక్యానుసారమైన, దైవశాస్త్ర పరమైన ఆశ్రయాన్ని కోల్పోయిందని నా అభిప్రాయం. దీని ఫలితంగా మనకు అనేక సంఘాలున్నాయి, కాని వాటిలో హితబోధ ఆశించిన స్థాయిలో లేదు. పలు సువార్త సభలు జరుగుతున్నాయి, కానీ నిజంగా మార్పు చెందినవారి సంఖ్య చాలా తక్కువ. అనేకమంది కాపరులు ఉన్నా, పరిచర్యకు అర్హులైనవారు చాలా తక్కువ.
ఫలితాల కోసం నాణ్యతను పణంగా పెట్టడమే పరిస్థితి:
బైబిలు యొక్క గొప్ప ఆజ్ఞను పక్కన పెట్టి, సంఖ్యను పెంచుకోవాలనే ఆరాటంతో, సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆత్రుతతో, స్థానిక సంఘం తన వాక్య ఆచరణను పణంగా పెట్టింది. దీని కారణంగా కాపరుల అర్హతలు, ప్రమాణాలు తగ్గిపోతున్నాయి.
పరిచర్యకు పిలుపు: పునర్విమర్శ అవసరం
సువార్తికులు మరియు కాపరుల పిలుపు గురించి బైబిలు చెబుతున్న దానిపై మనం మరలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. "బైబిల్లోని ఆజ్ఞలను సవరించడానికి ఎవరికీ అధికారం లేదు" అని గుర్తు పెట్టుకోవాలి. సువార్తకు పిలుపునందుకున్న వారికి కూడా బైబిలు నిర్దేశించిన ఆజ్ఞలున్నాయి.
మీ పిలుపు గురించి ఆలోచించండి: కొన్ని ప్రశ్నలు
1. మీరు తిరిగి జన్మించారా?
ఈ ప్రశ్న చాలా ప్రాథమికమైనదిగా అనిపించవచ్చు, కాని ఇది చాలా కీలకం.
ఎవరైనా తిరిగి జన్మించని పాపపునే సువార్తికుడిగా వ్యవహరించాలనుకుంటే, అతడు తన ఆత్మ గురించి ఆలోచించడం ప్రారంభించాలి.
"పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్న మాట నమ్మదగినది, పూర్ణ ఆంగీకారమునకు యోగ్యమైనది; అట్టి పాపులలో నేను ప్రధానుడను."
1 తిమోతికి 1:15
పౌలు ఒకప్పుడు దేవదూషణ, హింస, హంతకత్వాలలో ఉన్నాడు (1 తిమోతికి 1:12-13), కానీ యేసును నమ్మినప్పుడు దేవుని కనికరం పొందాడు. అదే కాపరి, ప్రసంగికుడు, సువార్తికుడు కావాలనుకునే ప్రతి ఒక్కరికి మొదటి ఘట్టం కావాలి.
2. మీరు స్థానిక సంఘంతో గాఢమైన సంబంధాన్ని కలిగియున్నారా?
స్థానిక సంఘానికి సంబంధం లేకుండా జరిగే పరిచర్య బైబిలు సిద్ధాంతాలకు విరుద్ధమని పాస్టర్ జాన్ మెకార్థర్ గారు పేర్కొన్నారు.
"ఒక వ్యక్తి తనకు తానుగా పాస్టర్ గా నియమించుకోవడం లేఖనానికి పూర్తిగా విరుద్ధం" అని వారు చెప్పిన మాటలు మనం గుర్తించాలి.
1 తిమోతికి 3:7 లో చెప్పినట్లుగా, "అతడు సంఘమునకు వెలుపటి వారిచేత మంచి సాక్ష్యము పొందినవాడై యుండవలెను." కాపరి కావాలనుకునే వ్యక్తి స్థానిక సంఘం గమనింపదగిన సచ్చీలతతో ఉండాలి.
స్థానిక సంఘం ఆమోదం లేకుండా కాపరి కావడం బైబిలుకు విరుద్ధం.