ప్రపంచ చరిత్రలో క్రీస్తు యొక్క పునరుత్థానం తనదైన రీతిలో ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకుంది. క్రైస్తవ్యంలో కూడా క్రీస్తు యొక్క పునరుత్థానం ఒక అద్భుతమైన సంఘటన.
కానీ నేటి క్రైస్తవులు దానిని కేవలం ఒక అద్భుతంగా మాత్రమే చూడడం చాలా విచారకరం. ఎందుకంటే మనం క్రీస్తు పునరుత్థానం యొక్క ప్రాముఖ్యత, అవసరత, విశిష్టతలను అర్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం.
క్రీస్తు పునరుత్థానం ఒక ముఖ్యమైన సిద్ధాంతం.
క్రైస్తవ్యంలో క్రీస్తు యొక్క పునరుత్థానం గురించిన సిద్ధాంతం చాల కీలకమైనది. పునరుత్థానాన్ని గురించిన విషయాలు , దాని ప్రాముఖ్యత యేసు క్రీస్తు ప్రభువే స్వయంగా బోధించాడు (మత్తయి 17: 22-23, లూకా 20:27-40). పాత నిబంధన విశ్వాసులు కూడా ఆయన పునరుత్థానం గురించి మాట్లాడినట్లుగా మనం చూస్తాము ( యోబు 19:25-27, కీర్తనలు 16:10, కీర్తనలు 110:1).
అలాగే యోహాను సువార్తలో ఆయన తానే పునరుత్థానమును జీవమును అని, తనయందు మాత్రమే విశ్వాసముంచువాడు చనిపోయినా సరే బ్రతుకుతాడని ప్రకటించాడు (యోహాను సువార్త 11:25). అపోస్తలులు క్రీస్తుని ప్రకటించేటప్పుడు కేవలం క్రీస్తు యొక్క మరణాన్ని మాత్రమే కాకుండా క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని కూడా ప్రకటించారని 1 కొరింథీ 15:12, 1 కొరింథీ 15:2-3 లేఖనాలలో మనం చూడొచ్చు. అలాగే అపోస్తుల కార్యాలలో పేతురు ఇచ్చిన సువార్త ప్రసంగంలో కూడా పునరుత్థానం ప్రధానమైన అంశంగా ఉంది (అపో 2:22-31).
సువార్తలో క్రీస్తు యొక్క మరణం ఎంత ప్రాముఖ్యమో అదే ప్రాముఖ్యత పునరుత్థానానికి కూడా ఉంది. వాస్తవానికి పునరుత్థానం లేకపోతే మన రక్షణ అసంపూర్ణమైనదే ఔతుంది.
ఒకరు క్రైస్తవ విశ్వాసం కలిగి ఈ సిద్ధాంతాన్ని తిరస్కరిస్తే వారి విశ్వాసం వ్యర్థం ( 1 కొరింథీ 15:2). పునరుత్థానం లేకపోతే క్రైస్థవుడికి నిరీక్షణే లేదు. పునరుత్థానం గురించిన సిద్ధాంతం ప్రతీ క్రైస్తవుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన సిద్ధాంతం.
యదార్ధ సంఘటనా లేక కల్పితమా?
క్రీస్తు మరణించి మూడవ రోజున తిరిగి లేసాడన్నది కట్టుకథ కాదు, ఒక యదార్ధ సంఘటన. చరిత్రలో నిరూపించబడిన సంఘటన. ఈ సంఘటన జరగలేదన్నట్లుగా , నిజాన్ని దాచే ప్రయత్నం ప్రస్తుత కాలంలో చేస్తున్నారంటే ఆశ్చర్య పడాల్సిన అవసరము లేదు. ఇలాంటి ప్రయత్నం బైబిల్లో కూడా మనం చూడొచ్చు ( మత్తయి 28:11-15), సిలువలో మరణించిన క్రీస్తు శరీరాన్ని సమాధి చేసినప్పుడు దానికి కాపలాగా సైనికులను ఉంచమని యూదామత ప్రధానులు పిలాతును కోరతారు (మత్తయి 27:61-66), ఆదివారం తెల్లవారుచుండగా స్త్రీలు ఆ సమాధిని చూడడానికి వచ్చినప్పుడు, అప్పటికే క్రీస్తు మృత్యుంజయుడౌతాడు.ఈ విషయం తెలిసిన ప్రధానయాజకులు కాపలాగా ఉన్న ఆ సైనికులకు లంచం ఇచ్చి వారు నిద్రపోతుండగా క్రీస్తు శిష్యులు రాత్రివేళ వచ్చి క్రీస్తుని ఎత్తుకుపోయరన్న అబద్ధాన్ని ప్రకటించమని చెబుతారు. ఇలాంటి కట్టుకథలు ఎన్ని వచ్చినా క్రైస్తవ చరిత్రకారులు మాత్రమే కాకుండా మతరహిత విద్యా పండితులు కూడా ఇది కట్టు కథ కాదని, నిజంగా జరిగిన సంఘటన అని నిర్ధారించారు. అమెరికాలో వృత్తి రీత్యా పేరు పొందిన లీ స్ట్రాబెల్ అనే జర్నలిస్ట్ క్రీస్తు దేవుడు కాదు, ఆయన అసలు మరణించలేదు, ఆయన పునరుత్థానం అనేది ఒక భ్రమయని నిరూపించే ప్రయత్నం చేసాడు. అతను ఒక నాస్తికుడు కూడా .
లీ స్ట్రాబెల్ చేసిన మిక్కుటమైన పరిశోధనలో చివరికి క్రీస్తు ఒక కల్పిత పాత్ర కాదు, అయన దేవుని కుమారుడు, అయన మరణం , అయన పునరుత్థానం నిరాకరించరాని సత్యాలని తేలింది. దానిని ఆయన ఆధారాలతో సహా నిరూపించాడు. నాస్తికుడిగా ఉన్న అతను ఇప్పుడు దేవుని పరిచర్య చేస్తున్నాడు.