
Daily devotion · Tuesday, 27 October 2026
క్రీస్తే మన విమోచన
Scripture
మార్కు 10:45“మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.”
Reflection
ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఆయన చేసిన పరిచర్యలో అత్యంత ముఖ్యమైన కార్యం ఏమిటి?
మార్కు సువార్త పదవ అధ్యాయంలో ఈ ప్రశ్నలకు యేసుక్రీస్తు స్వయంగా సమాధానం ఇస్తున్నాడు.
యేసుక్రీస్తు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు, అక్కడ తనకు ఎదురుకాబోయే శ్రమలు, మరణం, పునరుత్థానం గురించి శిష్యులకు తెలియజేశాడు (10:32–34). అయితే ఆ తరువాత యాకోబు, యోహాను ఆయన మహిమలో తమకు గొప్ప స్థానాలు ఇవ్వమని అడిగారు.
యేసుక్రీస్తు తన మరణం గురించి మాట్లాడుతుంటే, శిష్యులు తమ గొప్పతనం గురించి ఆలోచిస్తున్నారు.
అప్పుడు యేసుక్రీస్తు ఈ లోకంలోని పాలకులు ఇతరులపై అధికారం చెలాయిస్తారని, కానీ తన శిష్యుల మధ్య అలా ఉండకూడదని బోధించాడు. గొప్పవాడిగా ఉండాలనుకునేవాడు ఇతరులకు సేవ చేయాలని చెప్పాడు (10:42–44).
ఈ బోధకు తన జీవితాన్నే ఉదాహరణగా చూపిస్తూ, మనుష్యకుమారుడు సేవ చేయించుకోవడానికి కాకుండా, సేవ చేయడానికి వచ్చాడని చెప్పాడు.
అయితే ఆయన చేసిన సేవలో అత్యంత గొప్ప కార్యం ఏమిటి?
“అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుట.”
ఇక్కడ “విమోచన క్రయధనం” అనే మాట బంధనంలో ఉన్నవారిని విడిపించడానికి చెల్లించే వెలను సూచిస్తుంది. అలాగే “అనేకులకు ప్రతిగా” అనే మాట ఆయన ఇతరుల స్థానంలో తన ప్రాణాన్ని అర్పించాడని తెలియజేస్తుంది.
ఈ సత్యం లో ముందుగానే తెలియజేయబడింది. మన అతిక్రమాలను బట్టి ఆయన గాయపరచబడ్డాడని, మన దోషాలను బట్టి నలుగగొట్టబడ్డాడని అక్కడ చదువుతాం.
కాబట్టి యేసుక్రీస్తు మరణం కేవలం నిస్వార్థ ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణ మాత్రమే కాదు. పాపులమైన మన స్థానంలో మన పాపాలకు రావలసిన తీర్పును భరించి, మనకు విమోచన కలిగించిన ప్రాయశ్చిత్త బలి.
మన మంచి కార్యాల ద్వారా సంపాదించుకోలేని రక్షణను యేసుక్రీస్తు తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా మనకు అనుగ్రహించాడు.
ఈ సత్యం మన జీవితాన్ని కూడా మార్చాలి.
ఇతరులకంటే గొప్పవారిగా కనిపించాలని, గౌరవం పొందాలని మనం కోరుకుంటున్నామా? లేక మనలను రక్షించడానికి తన ప్రాణాన్నే అర్పించిన క్రీస్తును అనుసరిస్తూ, ఇతరులకు వినయంతో సేవ చేస్తున్నామా?
క్రీస్తు మనకు సేవ చేయడం నేర్పించడమే కాదు, మన విమోచన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, కృతజ్ఞతతో ఇతరులకు సేవ చేద్దాం.
Prayer
పరలోకపు తండ్రీ, నా పాపాల నుండి నన్ను విమోచించడానికి తన ప్రాణాన్ని అర్పించిన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి నీకు కృతజ్ఞతలు. ఆయన చేసిన రక్షణ కార్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడానికి నాకు సహాయం చేయుము. నా హృదయంలోని గర్వాన్ని తొలగించి, క్రీస్తు చూపించిన వినయాన్ని అనుసరిస్తూ ఇతరులకు ప్రేమతో సేవ చేసేలా నన్ను నడిపించుము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.