
Daily devotion · Wednesday, 28 October 2026
మొదటి స్థానం ఎవరిది?
Scripture
నిర్గమకాండము 20:1–3"నీ దేవుడనైన యెహోవాను నేనే; నేనే దాసుల గృహమైన ఐగుప్తుదేశములోనుండి నిన్ను వెలుపలికి రప్పించితిని; నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.” — నిర్గమకాండము 20:2–3
Reflection
దేవుడు ఇశ్రాయేలీయులకు పది ఆజ్ఞలు ఇచ్చే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేశాడు. తానే వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించానని చెప్పాడు.
ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు ఇశ్రాయేలీయులను విడిపించడానికి ముందు ఆజ్ఞలు ఇచ్చి, వాటిని పాటిస్తేనే విడిపిస్తానని చెప్పలేదు. ముందుగా వారిని విడిపించాడు. ఆ తరువాత తన ప్రజలుగా ఎలా జీవించాలో తెలియజేశాడు.
మొదటి ఆజ్ఞలో, “నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు” అని చెప్పాడు. తమను విడిపించిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని, ఆయనకే విధేయులుగా జీవించాలని ఈ ఆజ్ఞ ద్వారా ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు.
ఈ ఆజ్ఞ మన హృదయాలను కూడా పరిశీలించుకునేలా చేస్తుంది.
మనం ఇతర దేవతలను పూజించకపోవచ్చు. కానీ మన హృదయంలో దేవునికి చెందాల్సిన స్థానాన్ని మరేదైనా ఆక్రమిస్తోందా?
డబ్బు, ఉద్యోగం, పేరు, కుటుంబం వంటి విషయాలు మనకు దేవునికంటే ముఖ్యమైనవిగా మారుతున్నాయా? మన భద్రత, సంతోషం, భవిష్యత్తు వాటిపైనే ఆధారపడి ఉన్నాయని భావిస్తున్నామా? వాటికోసం దేవుని మాటకు అవిధేయత చూపించడానికి కూడా సిద్ధపడుతున్నామా?
దేవుడు మన బాహ్య ఆరాధనను మాత్రమే కాదు, మన హృదయాన్నంతటినీ కోరుతున్నాడు.
యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనలను పాపపు అధికారం నుండి విడిపించాడు (). మన విధేయత ద్వారా ఆయన రక్షణను సంపాదించుకోలేము. అయితే ఆయన కృపచేత రక్షించబడినవారిగా, మనలను విమోచించిన దేవుణ్ణి ప్రేమిస్తూ, ఆయనను మాత్రమే ఆరాధిస్తూ, ఆయనకు విధేయులుగా జీవించాలి.
ఈ రోజు మనల్ని మనం ప్రశ్నించుకుందాం: నా జీవితాన్ని నిజంగా నడిపిస్తున్నది ఎవరు? దేవుడా, లేక ఆయన స్థానంలో నేను ఉంచుకున్న మరేదైనానా?
Prayer
పరలోకపు తండ్రీ, నా హృదయంలో నీకు చెందాల్సిన స్థానాన్ని మరేదైనా ఆక్రమించి ఉంటే దాన్ని గుర్తించేలా నాకు సహాయం చేయుము. నీకంటే ఇతర విషయాలను ఎక్కువగా ప్రేమించినందుకు నన్ను క్షమించుము. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నీవు అనుగ్రహించిన రక్షణను గుర్తుచేసుకుంటూ, నిన్ను మాత్రమే ఆరాధిస్తూ, నీకు విధేయుడిగా జీవించేలా నన్ను నడిపించుము. ఆమేన్.