
Daily devotion · Thursday, 12 November 2026
నశించని సంపద
Scripture
మత్తయి 6:21నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
Reflection
మన జీవితంలో మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం? డబ్బు సంపాదించడానికా? మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, ఆస్తులు సంపాదించుకోవడానికా? లేక దేవునితో మనకున్న సంబంధానికా?
మన అవసరాల కోసం కష్టపడి పనిచేయడం, డబ్బు సంపాదించడం, భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడం తప్పు కాదు. కానీ ఇవే మన జీవితంలో అత్యంత ముఖ్యమైనవిగా మారితే, మన హృదయం వాటిపైనే ఆధారపడటం మొదలవుతుంది.
లో యేసుక్రీస్తు ప్రభువు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తున్నారు.
కొండమీద ప్రసంగంలో తన శిష్యులకు దేవుని రాజ్యానికి తగిన విధంగా ఎలా జీవించాలో బోధిస్తూ, భూమిమీద ధనాన్ని కూడబెట్టుకోవద్దని, పరలోకంలో ధనాన్ని కూడబెట్టుకోవాలని చెబుతున్నారు.
ఎందుకంటే భూమిమీద మనం సంపాదించుకునేవన్నీ శాశ్వతమైనవి కావు. వస్తువులు పాడైపోవచ్చు, ఆస్తులు కోల్పోవచ్చు, మనం ఎంతో కష్టపడి సంపాదించిన సంపద ఒకరోజు లేకుండా పోవచ్చు.
కానీ పరలోకంలో కూడబెట్టుకునే ధనం అలాంటిది కాదు. దాన్ని చిమ్మెటలు, తుప్పు నాశనం చేయలేవు. దొంగలు దొంగిలించలేరు.
అయితే పరలోకంలో ధనం కూడబెట్టుకోవడం అంటే ఏమిటి?
దేవుని రాజ్యానికి ప్రాధాన్యం ఇస్తూ, ఆయన వాక్యానికి విధేయులుగా జీవించడం, మనకు ఉన్న వనరులను ఆయన మహిమ కోసం, ఇతరుల మేలు కోసం ఉపయోగించడం.
లో కూడా పౌలు ధనవంతులు తమ సంపదపై కాకుండా దేవునిపై నిరీక్షణ ఉంచాలని, మంచి క్రియలు చేస్తూ ఇతరులతో పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలని బోధిస్తున్నాడు.
అంటే మన సంపదను ఎలా ఉపయోగిస్తున్నామన్నది మన హృదయంలో దేనికి ప్రాధాన్యం ఇస్తున్నామో తెలియజేస్తుంది.
అందుకే 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు, “నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును” అని చెప్పారు.
మనకు ఏది అత్యంత విలువైనదో, మన ఆలోచనలు, కోరికలు, నిర్ణయాలు కూడా దాని చుట్టూనే తిరుగుతుంటాయి.
మనం సంపదనే మన భద్రతకు ఆధారంగా భావిస్తే, దాన్ని కోల్పోతామనే భయం మనల్ని నడిపిస్తుంది. కానీ దేవునిపై ఆధారపడితే, మనకున్న సంపదను కూడా ఆయన ఇచ్చిన బాధ్యతగా చూస్తాం.
లో యేసుక్రీస్తు ప్రభువు దేవునికీ, ధనానికీ ఒకేసారి దాసులుగా ఉండలేమని స్పష్టంగా చెప్పారు.
కాబట్టి ఇక్కడ ప్రశ్న మన దగ్గర ఎంత డబ్బు ఉందన్నది కాదు. మన హృదయంలో డబ్బుకు ఎలాంటి స్థానం ఇచ్చామన్నది.
అయితే మనం చేసే మంచి పనుల ద్వారా పరలోకంలో స్థానం సంపాదించుకుంటామని దీని అర్థం కాదు. మన రక్షణ దేవుని కృపచేత, యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ద్వారా మాత్రమే లభిస్తుంది ().
ఆ కృపను పొందిన మనం, ఈ లోకంలో ఉన్నవాటికంటే క్రీస్తుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ జీవించడానికి పిలువబడ్డాం.
అందుకే ఈ రోజు మన ప్రాధాన్యతలను పరిశీలించుకుందాం. మన సమయాన్ని, డబ్బును, శక్తిని ఎక్కువగా దేని కోసం ఉపయోగిస్తున్నాం? మన నిర్ణయాలను నడిపిస్తున్నది దేవుని వాక్యమా, లేక ఈ లోకంలో ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలనే కోరికా?
మన దగ్గర ఉన్న సంపద కంటే, మన హృదయంలో ఎవరికి మొదటి స్థానం ఇచ్చామన్నదే ముఖ్యం.
ఆలోచించండి
- మీ జీవితంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు? మీ సమయం, డబ్బు, నిర్ణయాలు మీ హృదయం గురించి ఏం తెలియజేస్తున్నాయి?
- మీ భద్రత కోసం మీరు దేనిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు? మీ సంపదపైనా, ఉద్యోగంపైనా, లేక దేవునిపైనా?
- దేవుడు మీకు ఇచ్చిన వనరులను ఆయన మహిమ కోసం ఎలా ఉపయోగించగలరు? ఈ విషయంలో మీరు మార్చుకోవాల్సిన ప్రాధాన్యతలు ఏమైనా ఉన్నాయా?
Prayer
పరలోక తండ్రీ, మాకు అవసరమైన వాటిని అనుగ్రహిస్తూ మమ్మల్ని పోషిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. కొన్నిసార్లు ఈ లోకంలోని సంపదకు, సౌకర్యాలకు నీకంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాము. మా హృదయాలను పరిశీలించుకొని, మా జీవితంలో నీకే మొదటి స్థానం ఇవ్వడానికి సహాయం చేయుము. మాకు ఇచ్చిన సమయాన్ని, సంపదను, అవకాశాలను నీ మహిమ కోసం, ఇతరుల మేలు కోసం ఉపయోగించే జ్ఞానాన్ని అనుగ్రహించుము. ఈ లోకంలోని తాత్కాలికమైన వాటిపై కాకుండా, యేసుక్రీస్తు ప్రభువులో మాకున్న నిత్యమైన నిరీక్షణపై మా హృదయాలను నిలిపేలా నడిపించుము. యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.