ఇటీవల మన తెలుగు క్రైస్తవ సమాజం లో క్రైస్తవులుగా పిలవబడే వారు చేసే వ్యాఖ్యల ద్వారా బైబిల్ యొక్క అధికారిత్వాన్ని ప్రశ్నించేలా చేస్తున్నాయి. క్రీస్తు వేదాలని రాయించాడని , క్రీస్తు వేదాలలో ఉన్నాడని చేసే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ఇది సమాజానికి ముప్పు మాత్రమే కాదు, దేవుని పట్ల చేసే అపరాధం. ఇది బైబిల్ గ్రంథం యొక్క అధికారంపై చేసే దాడి. ఈ తప్పుడు సిద్ధాంతాన్ని ఎదుర్కోవటానికి బైబిల్ యొక్క లక్షణాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. దేవుని అధికారిక వాక్యంగా ఉండటానికి అంతర్లీనంగా ఉన్న గ్రంథంలోని మూడు లక్షణాలను పరిశీలిద్దాము. దానిలో ఒకదాన్ని ఈ బ్లాగ్ లో చర్చిద్దాం.
ప్రతిలేఖనము దైవావేశమువలన కలిగినది.
"దైవావేశము” అన్న పదానికి లోతైన అర్ధాన్ని తెలుసుకోనే ప్రయత్నం చేసే ముందు, దాని నిర్వచనాన్ని చూద్దాం. దేవుడు తన వాక్యాన్ని మనకి ఏ విధంగా ఇచ్చాడో అన్న దానిని వివరించేది దైవావేశన .అది ఒక వాహనం లాంటిది. ఇక్కడ అపోస్తులుడైన పౌలు 2 తిమోతి 3:16 లో తిమోతిని అభినందిస్తూ (2 తిమోతి 3:1-10) , తాను నేర్చుకొని రూఢియని నమ్మిన వాక్యములో నిలకడగా ఉండమని హెచ్చరిస్తూ , వాక్యానికి గల శక్తిని, ప్రయోజనాన్ని ,మూలాన్ని వివరిస్తున్న సందర్భం లో పలికిన మాటలివి. ఇక్కడ వాడిన "దైవావేశము"వలన అన్న పదానికి ప్రత్యేకమైన అర్ధం ఉంది. అక్కడ వాడిన గ్రీకు పదం మరి ఎక్కడ బైబిల్ లో వాడబడలేదు. దాని అర్ధము ,"దేవుని ఊపిరి". దేవుడు తనంతటతానుగా ఇచ్చిన మాటలు అని చెప్పే ప్రయత్నంలో వాడిన పదం. దానిని సులువుగా అర్థంచేసుకోవాలంటే "దైవప్రేరణ" అని చెప్పవచ్చు.
"మిమ్మల్ని ఎవరు ప్రేరేపించారు?", "మీ ప్రేరణ ఏమిటి?" అన్న ప్రశ్నలు మనము వింటూనే ఉంటాము లేదా మనల్నిఎవరైనా అడిగిఉండొచ్చు. మంచి పాటలు రాసినప్పుడు వెనుక ప్రేరేపణ ఉంటుంది. ఒక అద్భుతమైన పెయింటింగ్ వెనుక ఒక ప్రేరణ ఉంటుంది. ఒక మనిషి మరొక మనిషిని ప్రేరేపించవచ్చు.అయితే, వాక్యము దైవావేశము లేదా దైవప్రేరణ అన్నపుడు మనము పైన చెప్పిన విషయాలను బట్టి వచ్చే అర్ధం తీసుకుంటాము. కానీ మనిషి పొందే ప్రేరణ , దైవికమైన ప్రేరణ ప్రమాణము వేరు . దైవ ప్రేరణ అత్యున్నతమైనది. దానికి పరిధులు ఉండవు. దేవుడు ఎవరిచేత ప్రేరణ పొందేవాడు కాదు.
వేదాలను క్రీస్తు రాయించే ఉంటాడు కానీ, బైబిల్ లో ఉన్న క్రీస్తు , వేదాలలో ఉన్న క్రీస్తు మాత్రం వేరువేరు.
సంఘ చరిత్రలో "దైవావేశము " అన్న నిర్వచనాన్ని వక్రీకరించే ప్రయత్నం కూడా జరిగింది. బైబిల్ ని దేవుడు రాయించాడు అన్న విషయాన్నీ అంగీకరించినా , అది మనకి దేవుడు ఏ విధంగా ఇచ్చాడో అన్న విషయం పై చాల వాదనలు వాదనలు వచ్చాయి .దానికలో కొన్ని చూద్దాం. దేవుడు తనంతటి తానుగ బైబిల్ మొత్తాన్ని చెప్పితే(డిక్టేషన్) బైబిల్ రచయితలు రాసారని ఒక వాదన ఉంది. వారి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకొని ఒక బ్రాంతిలో ఉండి రాసారనే వాదన కూడా ఉంది . మరొక వాదన ఏంటంటే , దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడిన మాటల వరకే దేవుని వాక్యం, మిగితాది దేవుని వాక్యం కాదు అన్న వాదనలు కూడా సంఘ చరిత్రలో మనము చూస్తాం . అయితే క్రైస్తవ వేదాంతవేత్తలు, క్రైస్తవ చరిత్రకారులు మరియు ఆదిమ క్రైస్తవులు ఈ వాదనని సంకోచం లేకుండా కొట్టిపారేశారు. దేవుడు తన వాక్యాన్ని డిక్టేషన్ ద్వారా ఇవ్వలేదన్న ఖచ్చితమైన నిర్ధారన కు వచ్చారు. దేవుడు తన సందేశాన్ని ఇవ్వడానికి రచయిత యొక్క ప్రతిభ, శైలి, వ్యక్తిత్వం, వృత్తి, పదజాలం లేదా వ్యాకరణాన్ని భర్తీ చేయలేదు. పరిశుద్దాత్మ దేవుడు అసంపూర్ణమైన మనుషుల ద్వారా తన సంపూర్ణమైన సత్యాన్ని మనకు తెలియ పరచాడు.( 1 కొరింథీ 2:10-13) ఈ సత్యము క్రైస్తవ విశ్వాస జీవితానికి నాంది.