దేవుని గురించి మనం నిజంగా ఎలా తెలుసుకోవాలి?
మన ఊహల ద్వారానా? మన భావాల ద్వారానా? మన చుట్టూ ఉన్న సంస్కృతి ఏమి చెప్తుందో దాని ద్వారానా? లేక దేవుడు తన గురించి తన వాక్యములో ఏమి తెలియచేశాడో దాని ద్వారానా?
ఇది మన జీవితానికి చాలా అవసరమైన ప్రశ్న. ఎందుకంటే దేవుడిని మనం మనకి నచ్చినట్టు ఊహించుకునే వ్యక్తి కాదు. “నాకు దేవుడు ఇలా అనిపిస్తున్నాడు,” “నా దృష్టిలో దేవుడు ఇలా ఉంటాడు,” అని మనం అనుకోవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే — దేవుడు తన గురించి ఏమి చెప్పాడు?
దేవుని గురించి నిజంగా తెలుసుకోవాలంటే, దేవుడే తనను తాను మనకి తెలియచేయాలి. ఆయన ఎవరో, ఆయన చిత్తం ఏమిటో, మనం ఆయన ముందు ఎలా జీవించాలో, మన పాపం ఎంత తీవ్రమైనదో, రక్షణ ఎక్కడ ఉందో — ఇవన్నీ మన ఊహతో తెలుసుకోలేం.
అందుకే “ప్రత్యక్షత” అనే సిద్ధాంతం చాలా ముఖ్యమైనది. ప్రత్యక్షత అంటే దేవుడు తనను తాను మనకి తెలియచేయడం. మనం దేవుణ్ణి వెతికి కనుక్కున్నాం అనేది కాదు. ముందుగా దేవుడే తనను తాను మనకి తెలియచేశాడు.
దేవుడు మనల్ని మన ఊహకి వదిలిపెట్టలేదు. “మీకు నచ్చినట్టు మీరు నన్ను అర్థం చేసుకోండి” అని వదిలేయలేదు. ఆయన తన వాక్యములో తనను తాను మనకి తెలియచేశాడు.
క్రైస్తవ విశ్వాసం మనుషులు తయారు చేసుకున్న మత ఆలోచన కాదు. ఇది నిజమైన దేవుని ఆరాధన. ఆయనే మన సృష్టికర్త. ఆయనే మన విమోచకుడు. కాబట్టి ఆయనను ఎలా తెలుసుకోవాలి, ఎలా ఆరాధించాలి, ఎలా సేవించాలి — ఇవన్నీ ఆయన ఇచ్చిన వాక్యములోనే మనం నేర్చుకోవాలి.
బైబిల్ని మనం సాధారణ పుస్తకంలా చూడకూడదు. అది కేవలం మంచి కథలు ఉన్న పుస్తకం కాదు. కేవలం మంచి మాటలు చెప్పే పుస్తకం కాదు. మనుషులు దేవుని గురించి రాసుకున్న ఆలోచనలు మాత్రమే కాదు.
బైబిల్ దేవుడు తన గురించి, తన కార్యాల గురించి, తన రక్షణ గురించి మనకి ఇచ్చిన వాక్యము.
బైబిల్లో మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి. క్రీస్తు రాకముందు రాయబడిన ముప్పై తొమ్మిది పుస్తకాలు పాత నిబంధన. క్రీస్తు వచ్చిన తరువాత రాయబడిన ఇరవై ఏడు పుస్తకాలు కొత్త నిబంధన. ఇవన్నీ కలిపి దేవుడు తన ప్రజలకి ఇచ్చిన వాక్యము.
బైబిల్లో చరిత్ర ఉంది. కీర్తనలు ఉన్నాయి. ప్రవచనాలు ఉన్నాయి. జ్ఞాన వాక్యాలు ఉన్నాయి. సువార్తలు ఉన్నాయి. అపొస్తలుల లేఖలు ఉన్నాయి. ఇవి వేరువేరుగా కనిపించినా, ఇవన్నీ ఒకే దిశగా మనల్ని తీసుకెళ్తాయి — దేవుడు ఎవరు? మనం ఆయన ముందు ఎలా జీవించాలి? యేసు క్రీస్తులో రక్షణ ఎలా ఉంది?
దేవుడు తన ప్రజలకు వాక్యాన్ని రాసి ఇచ్చిన విషయం బైబిల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నిర్గమకాండము 32:16లో దేవుడు ఇచ్చిన రాతి పలకల గురించి ఇలా ఉంది:
"ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకలమీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత. "
నిర్గమకాండము 32:16
ఈ వచనం మనకి ఒక ముఖ్యమైన విషయం చూపిస్తుంది. దేవుడు తన ప్రజలను వారి ఇష్టానుసారంగా జీవించమని వదిలేయలేదు. ఆయన తన వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని విని, నమ్మి, దానికి లోబడి జీవించమని పిలిచాడు.
ఇదే సత్యం మన క్రైస్తవ జీవితానికి కూడా వర్తిస్తుంది. మన విశ్వాసం మన భావాల మీద కట్టబడకూడదు. మన నిర్ణయాలు మన చుట్టూ ఉన్న సంస్కృతి మీద కట్టబడకూడదు. మన కుటుంబ జీవితం మన అభిప్రాయాల మీద కట్టబడకూడదు. ఇవన్నీ దేవుని వాక్యంపై కట్టబడాలి.
మన కాలంలో చాలామంది, “నీ మనస్సు చెప్పేది విను,” అంటారు. ఇంకొంతమంది, “నీకు నచ్చిందే నిజం,” అంటారు. “ప్రతి ఒక్కరికీ వారి వారి సత్యం ఉంటుంది,” అని కూడా చెప్తారు.