క్షమాపణ అనేది క్రైస్తవ జీవితంలో ఒక ప్రధాన భాగం. క్షమాపణ లేకుండా, ఒకరు క్రైస్తవుడిగా అవ్వలేరు . ఒకడు తన పాపాలను ఒప్పుకున్నప్పుడు , దేవుడు తన మహా కృపను బట్టి మన అపరాధాలను క్షమించి మనల్ని పవిత్రులుగా చేసాడు. (1 యోహాను 1:9,కీర్తన 32: 5) . క్షమాపణ క్రైస్తవునికి అపరిచితం కాదు. క్షమాపణ ,సువార్తలో ఉన్న ప్రధాన అంశం. ఇది దేవుని మహా సంకల్పం.
మానవ సంబంధాల్లో, క్షమాపణ అనేది కొన్ని సందర్భాల్లో చాలా కష్టంగానూ, మరికొన్ని సందర్భాల్లో అసాధ్యంగా కనిపిస్తుంది. ఎన్నో రకాలుగా మనుషులు మనల్ని బాధపెట్టవచ్చు. కొన్ని సార్లు కావాలని చేస్తారు, మరి కొన్ని సార్లు అనుకోకుండా చేస్తారు. మనకి ఆత్మీయులైనవారు బాధపెడితే ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది. చాల సార్లు మనకి వచ్చే బాధలు , క్రీస్తును ఎరగని వారినుంచి కన్నా, క్రైస్తవులనుంచే వస్తాయి. మరి కొన్ని సందర్భాల్లో, మన స్నేహితులు, కుటుంబ సభ్యులే దానికి కారణం అవ్వవచ్చు. అప్పుడు ఆ బాధ నరనరాలకు పాకుతుంది. దానివల్ల శరీరం , మనసు రెండిటి మీద ప్రభావం చూపిస్తుంది. బీపీ , ఆందోళన , వేదన , కోపం, చింత, బాధ, ఇంకా ఎన్నిటికో మనం గురౌతుంటాం , దాని వల్ల కొన్ని టన్నుల బరువును మోస్తున్నట్లుగా అనిపిస్తుంది. (సామెతలు 12:24). మీరు అలాంటి పరిస్థితిలో ఉండి మిమ్మును బాధించిన వారిని క్షమించలేకపోతున్నారా ? ఈ వ్యాసం మీకు సహాయపడుతుందని భావిస్తున్నాను. ఇక్కడ నేను , మనం ఒకర్ని క్షమించినప్పుడు లేదా క్షమించే ఆలోచనలో ఉన్నపుడు మనకి ఏమి జరుగుతుందో నాలుగు మాటలను మీ ముందు ఉంచుతున్నాను.
1 క్షమాపణ మనల్ని విముక్తి చేస్తుంది.
క్షమించకపోవడం వల్ల, మన భుజాలపై పెద్ద రాయి ఉన్నట్టుగా అనిపిస్తుంది. హృదయం నుండి కోపం, ద్వేషం, ఆగ్రహం వంటి భావోద్వేగాలు మొలకెత్తుతాయి. వీటికి మనం తెలీకుండానే బందీలం అయిపోతాము. దేవుని ప్రేమను మనం ఇతరులకు చూపించలేము. ఈ భావోద్వేగాలు ఆరోగ్యకరమైనవి కావు మరియు పాపాత్మకమైనవి కూడా . వీటివల్ల మన పిల్లలమీద, కుటుంబ సభ్యులమీద, దుష్ప్రభావం చూపిస్తాయి. దేవుని వాక్యం వీటికి దూరంగా ఉండమని మనకి భోదిస్తుంది.
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
ఎఫెసీయులకు 4:31-31
అలాగే, దేవుడు మనల్ని మన పాపం యొక్క ఆధిపత్యం నుండి విడుదల చేసాడు కాబట్టి మళ్ళీ ఆ ఉచ్చు లోకి వెళ్లాల్సిన అవసరమేంటి? (యోహాను 8:36 , గలతి 4:3-7). మనం క్షమించినప్పుడు, ఈ బలమైన భావోద్వేగాల నుండి మనం విడుదల పొందుతాము. దేవుడు ఇచ్చిన స్వేచ్ఛను ఆనందించగలుగుతాం.
2 క్షమాపణ మనల్ని దేవుని దగ్గరికి తీసుకువెళుతుంది.
బాధ తీవ్రత చాల ఎక్కువగా ఉన్నపుడు క్షమించడం కొన్ని సందర్భాల్లో చాల కష్టంగా ఉంటుంది. ఆ బాధ త్రోసివేయలేనిది. అలాంటి సమయాల్లో క్రైస్తవులంగా మనం క్షమించాలని తెలిసినా చేయలేని పరిస్థితి ఉంటుంది (మత్తయి 5:44). ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనంగా ఉంటుంది. విధేయత అసాధ్యంగా కనిపిస్తుంది. అయితే మన బలహీనతను ఎరిగినవాడై, ప్రార్థన ఎలా చేయాలో తెలీని సమయంలో మనలో ఉన్న ఆత్మదేవుడు , దేవుని చిత్త ప్రకారం తానే మన పట్ల విజ్ఞాపన చేస్తాడు. దేవుని ఆజ్ఞలు కష్టంగా అనిపించినప్పటికీ , వాటికీ విధేయత చూపించగల కృపను కూడా దేవుడే అనుగ్రహిస్తాడు. క్షమించే శక్తి ఆయనే మనకి ఇస్తాడు. కనుక క్షమాపణ మనల్ని దేవుని దగ్గరకు తీసుకునివెళ్తుంది. మన వేదనలో దేవుడు మనకు మంచి స్నేహితుడు (సామెతలు17:17) . అలసిన సమయాల్లో, కృంగిన సమయాల్లో ఆయనే మనకు శాంతి, మన సహాయకుడు.